Rahul Gandhi: నాపై దాడికి ఈడీ ప్లాన్ చేసింది: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
- ఈడీ అంతర్గత వర్గాల ద్వారా సమాచారం అందిందన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత
- చాయ్, బిస్కెట్లతో ఎదురుచూస్తుంటానని వ్యంగ్యాస్త్రాలు
- శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ
లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై 29న పార్లమెంట్లో తాను చేసిన ‘చక్రవ్యూహం’ ప్రసంగం అనంతరం తనపై దాడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. తనపై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. చాయ్, బిస్కెట్లతో అధికారుల కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తుంటానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం స్పందించారు. ‘‘నా చక్రవ్యూహ ప్రసంగం ‘2 ఇన్ 1’కు నచ్చలేదు. నాపై దాడికి ప్లాన్ చేసినట్టు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. ఛాయ్, బిస్కెట్లతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటాను’’ అని అన్నారు.
కాగా జులై 29న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024పై రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శల దాడి చేశారు. బీజేపీ పార్టీ కమలం సింబల్‌ను ప్రదర్శించిన ఆయన.. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం సిద్ధమైందని విమర్శించారు.
వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో బంధించి చంపారని, తాను కొంచెం పరిశోధన చేసి చక్రవ్యూహాన్ని కనిపెట్టానని, 'పద్మవ్యూహం’ అని కూడా పిలవొచ్చని అన్నారు. ‘‘పద్మవ్యూహం అంటే 'కమలం ఏర్పడటం'. 21వ శతాబ్దంలో ఒక కొత్త 'చక్రవ్యూహం' ఏర్పడింది. అభిమన్యుడి మాదిరిగా భారతదేశంలోని యువకులు, రైతులు, మహిళలు, చిన్న-మధ్యతరహా వ్యాపారులు నేడు ఆరుగురు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. చక్రవ్యూహంలో ఆరుగురు వ్యక్తులు నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ’’ అని అన్నారు.