Air India: ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన ఎయిరిండియా.. కారణం ఇదే!
- ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమానాలు బంద్
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలే ఇందుకు కారణమన్న ఎయిరిండియా
- పరిస్థితులను సమీక్షించి విమానాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టెల్అవీవ్ నుంచి భారత్‌కు వచ్చే విమానాలను, ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
అలాగే, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చింది. కాగా, ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్ పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.