Palla Rajeshwar Reddy: ధరణి పోర్టల్ పేరును నాలుగు గోడల మధ్య పెట్టలేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
- అనేక రివ్యూలు చేసి అందరి సమక్షంలో ధరణి పేరును పెట్టామన్న ఎమ్మెల్యే
- కేసీఆర్ను పొంగులేటి అనరాని మాటలు అన్నారని ఆవేదన
- బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్యలు తగ్గాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పేరును నాలుగు గోడల మధ్య పెట్టలేదని... అనేక రివ్యూలు చేసి అందరి సమక్షంలో నిర్ణయించిన పేరే ధరణి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో 'భూమి హక్కులు, సంస్కరణలు' అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ... రెవెన్యూ చట్టాలను మార్చేందుకు నిర్వహించిన పలు సమావేశాల్లో పొంగులేటి కూడా నాటి సీఎం కేసీఆర్తో ఉన్నారన్నారు.
పొంగులేటికి ఇప్పుడు మంత్రిగా అవకాశం వచ్చిందని, మిగతా మంత్రులు తిట్టినట్లే ఆయన కూడా కేసీఆర్ పట్ల కొన్ని అనరాని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కేసీఆర్ పట్ల పొంగులేటి అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ధరణి చట్టం వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయన్నారు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా భూహక్కులు కల్పించామన్నారు. ధరణి ద్వారా తెచ్చిన భూసంస్కరణలు రైతులకు ఎంతో మేలు చేశాయన్నారు. ధరణి పేరు బాగా లేదని చెబుతూ భూమాత లేదా మరో పేరు మార్చుదామని అనుకుంటున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ధరణి అనే పేరు రాగానే వారికి కేసీఆర్ కనిపిస్తున్నారని, అందుకే మార్చుతున్నారన్నారు.
మా హయాంలో ఆత్మహత్యలు తగ్గాయి
బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో, రాష్ట్రాలలో ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుందని, అందులో వివరాలు ఉంటాయని, వాటిని చూసుకోవచ్చునన్నారు. అప్పుడు ఆత్మహత్యలు జరిగాయని పదేపదే అనడం సరికాదన్నారు. 2014లో అధికంగా ఉన్న ఆత్మహత్యలను కేసీఆర్ ప్రభుత్వం తగ్గించిందన్నారు.
భూమి ఎవరికి ఎలా ఉందో ఇటీవల ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశ పెట్టిన బుక్లో ఉందన్నారు. సీలింగ్ చట్టం ప్రకారం 25 నుంచి 52 ఎకరాల వరకే ఉండాలన్నారు. 25 నుంచి 52 ఎకరాల మధ్య 9,000 మందికి భూములు ఉన్నాయని, అవి చట్టం ప్రకారమే ఉన్నాయని సోషియో ఎకనమిక్ ఔట్ లుక్ బుక్లో ఉపముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.