Siddaramaiah: కర్ణాటక గవర్నర్ పై సీఎం సిద్ధరామయ్య ఎదురుదాడి
- 'ముడా' వ్యవహారంలో సిద్ధరామయ్యకు రాజ్ భవన్ షోకాజ్ నోటీసులు
- కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మలా మారారన్న సిద్ధరామయ్య
- తప్పు చేయలేదు కాబట్టి తానేమీ భయపడబోనని స్పష్టీకరణ
మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తనకు షోకాజ్ నోటీసులు పంపడం పట్ల సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. గవర్నర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మలా తయారయ్యారని, రాజ్ భవన్ ను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
సిద్ధరామయ్య నేడు మైసూరు ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ, "ఇలాంటి వాటికి నేనెందుకు భయపడాలి? తప్పు చేస్తే కదా నేను భయపడాలి? ముడా వ్యవహారంలోనే నేను ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదు. బహుశా ఈ వ్యవహారంలో విపక్షనేత ఆర్.అశోక భయపడాలి" అని వ్యాఖ్యానించారు. గవర్నర్ షోకాజ్ నోటీసులు పంపడంతో ముఖ్యమంత్రి వణికిపోతున్నారని విపక్ష నేత అశోక వ్యాఖ్యానించడంపై సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు.
కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాజీ మంత్రులు శశికళ జోలే, మురుగేశ్ నిరానీ, జనార్దనరెడ్డి వంటి వారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, వారిపై ఫిర్యాదులు గవర్నర్ కార్యాలయంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. రాజ్ భవన్ ను కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు.