Rahul Gandhi: వాయనాడ్‌లో కాంగ్రెస్ 100 ఇళ్లను నిర్మిస్తుంది: రాహుల్ గాంధీ
- నిన్నటి నుంచి తాను వాయనాడ్‌లోనే ఉన్నానన్న రాహుల్ గాంధీ
- నిన్న ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లానని వెల్లడి
- ఈరోజు పంచాయతీ అధికారులతో సమావేశమై ప్రమాద వివరాలు తెలుసుకున్నట్లు వివరణ
ప్రకృతి ప్రకోపానికి గురైన వాయనాడ్‌లో కాంగ్రెస్ 100 ఇళ్లను నిర్మిస్తుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కేరళలో ఒక్క ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఇంతటి దుర్ఘటన జరగలేదన్నారు. ఢిల్లీలోనూ తాను ఈ అంశాన్ని లేవనెత్తానని తెలిపారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వాయనాడ్‌లో సహాయక శిబిరాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేను నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నానని... ఇది భయంకరమైన విషాదమన్నారు.
నిన్న ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లామని, సహాయక శిబిరాలను కూడా సందర్శించామన్నారు. ఈరోజు తాము పంచాయతీ అధికారులతో సమావేశమయ్యామని, ప్రమాదం ప్రభావంపై వారు వివరించినట్లు తెలిపారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి వివరించారన్నారు. సాధ్యమైన మేర సాయం చేసేందుకే తాము ఇక్కడ ఉన్నామన్నారు. ఇక్కడ 100కు పైగా ఇళ్లను కాంగ్రెస్ కట్టిస్తుందన్నారు. ఇది ఘోర విషాదమన్నారు.
కేరళలోని వాయనాడ్ లో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 350 భవనాలు దెబ్బతిన్నాయి. 275 మంది వరకు మృతి చెందారు.