Chandrababu: పెట్టుబడులతో వచ్చే సంస్థలకే భూ కేటాయింపులు: ఏపీ సీఎం చంద్రబాబు
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
- అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా మార్చేవారికే భూకేటాయింపులు చేయాలని వెల్లడి
- జీవో నెం.207 ప్రకారమే సీఆర్డీఏ పరిధి ఉంటుందని స్పష్టీకరణ
- మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను వెనక్కి తీసుకురావాలని ఆదేశం
ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా మార్చేవారికి, పెట్టుబడులతో వచ్చే వారికే భూ కేటాయింపులు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేపడతామని వెల్లడించారు.
గతంలో గుర్తించిన 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని ఉంటుందని తెలిపారు. 2015లో ఇచ్చిన జీవో నెం.207 ప్రకారమే సీఆర్డీఏ పరిధి ఉంటుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.అన్నారు.
కాగా, నేటి సీఆర్డీఏ సమావేశంలో... అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ఎలాంటి విద్యాసంస్థలను ఆహ్వానించాలన్న విషయం కూడా చర్చించారు. నాలుగు లేన్లుగా కరకట్ట నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) నిర్మాణంపై ముందుకు వెళ్లాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు.