India vs Sri Lanka: శ్రీలంకతో తొలి వన్డే టై అవడంతో భారత్ ఖాతాలో చేరిన ఓ రికార్డు
- వన్డేల్లో అత్యధిక టై మ్యాచ్‌లు నమోదు చేసిన రెండవ జట్టుగా నిలిచిన టీమిండియా
- ఇప్పటివరకు భారత్ ఆడిన వన్డేల్లో టైగా ముగిసిన 10 మ్యాచ్‌లు
- 11 టై మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలిచిన వెస్టిండీస్
శ్రీలంకతో శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌ను భారత జట్టు త్రుటిలో చేజార్చుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ కూడా సమంగా 231 పరుగులు చేసింది. 48వ ఓవర్‌లో భారత విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో క్రీజులో ఉన్న అర్షదీప్ సింగ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. పర్యవసానంగా వన్డే క్రికెట్‌లో భారత్ పేరిట ఓ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్‌లో అత్యధిక టై మ్యాచ్‌లను నమోదు చేసిన రెండవ జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను భారత్ అధిగమించింది.
శ్రీలంకతో జరిగిన తాజా వన్డేతో కలుపుకొని ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌ల్లో 10 టైగా ముగిశాయి. మొత్తం 11 టై మ్యాచ్‌లతో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానానికి చేరింది. ఈ క్రమంలో 9 చొప్పున టై మ్యాచ్‌లతో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లను భారత్ అధిగమించింది. ఇక 8 టై మ్యాచ్‌లతో జింబాబ్వే ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.