Kamala Harris: డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్ అధికారికంగా ఖరారు!
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోటీ ఇచ్చేందుకు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అధికారికంగా ఖరారవ్వడం లాంఛనమైంది. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా పార్టీలో అంతర్గత ఆమోదం కోసం జరుగుతున్న ఓటింగ్‌లో ఆమె మెజారిటీ సాధించారు. మొత్తం 4000 మంది పార్టీ ప్రతినిధులు ఓటర్లుగా ఈ ఎన్నికల్లో రెండవ రోజు శుక్రవారం ఆమె మెజారిటీని దక్కించుకున్నారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఏకైక అభ్యర్థిగా కమలా హ్యారీస్ నిలిచారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికలు మరో మూడు రోజులపాటు జరగనున్నాయి. ఫలితాన్ని అధికారికంగా ఈ నెలాఖరులో షికాగో వేదికగా జరగనున్న పార్టీ సమావేశంలో ప్రకటించనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీపడనుండడం గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా కమలా హ్యారీస్ వ్యాఖ్యానించారు. పార్టీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మెజారిటీ ఓట్లు సాధించిన అనంతరం ఆమె ఈ విధంగా స్పందించారు. కాగా ఎన్నికల రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగిన తర్వాత పార్టీపై కమలా హ్యారీస్ పూర్తి నియంత్రణ సాధించారు. పార్టీకి చెందిన ఇతర నేతలెవరూ అభ్యర్థిత్వం కోసం ముందుకు రాలేదు. దీంతో ప్రధాన పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను ఖరారు చేసుకోబోతున్న మొట్టమొదటి నల్లజాతీయురాలిగా, దక్షిణాసియా మహిళగా ఆమె నిలవడం లాంఛనప్రాయమైంది.