Danam Nagender: బీఆర్ఎస్ వాళ్లు చెప్పలేని పదాలతో సభలో దూషించారు.. అవి రికార్డ్ కాలేదు: దానం నాగేందర్
- సీఎంను, తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయానన్న దానం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన
- తాను చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో వాడుక భాషలోనివేనని వ్యాఖ్య
- తన మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాణలు చెబుతున్నానన్న మాజీ మంత్రి
నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పరుషపదజాలం ఉపయోగించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ అంశంపై మరోసారి స్పందించారు. శాసన సభలో హైదరాబాద్ అభివృద్ధిపై తాను మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదేపదే ఆటంకం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు బయటకు చెప్పలేని పదాలతో తనను దూషించారని ఆరోపించారు. వారు మాట్లాడింది మైక్‌లో రికార్డ్ కాలేదన్నారు. ముఖ్యమంత్రిని, తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... శాసన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కావాలని టార్గెట్ చేశారన్నారు. తాను బీఆర్ఎస్ సభ్యుల పట్ల చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో వాడుక భాషలోనివే అన్నారు. ఆ మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే మాత్రం క్షమాపణ చెబుతున్నానన్నారు.
అధికారం కోల్పోవడం వల్ల బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గత పదేళ్ల కాలంలో ఏరోజూ తనలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. వారు తమ తీరును మార్చుకోవాలన్నారు.