Punjab: ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ఆ ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరణ
- నేటి నుంచి 9 వరకు ప్యారిస్ ఒలింపిక్స్ వెళ్లేందుకు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ
- ఇంత తక్కువ సమయంలో భద్రత కల్పించలేమని తెలిపిన కేంద్రం
- రాజకీయ అనుమతులను కేంద్రం నిరాకరించిందన్న అధికారులు
ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లడానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఇంత తక్కువ సమయంలో భద్రతను కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. భగవంత్ మాన్‌కు ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు రాజకీయ అనుమతులను కేంద్రం నిరాకరించిందని శనివారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.
భగవంత్ మాన్ భారత హాకీ టీమ్‌కు మద్దతుగా ఆగస్ట్ 3 నుంచి 9 వరకు ప్యారిస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. వారం రోజుల పాటు ప్యారిస్ పర్యటనకు తనకు, తన భార్యకు పంజాబ్ సీఎం అనుమతి కోరారు. అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న సీఎంకు ఇంత తక్కువ సమయంలో అంతర్జాతీయస్థాయి భద్రతను కల్పించడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేశారు.
ముఖ్యమంత్రులు సహా సీనియర్ నేతలు విదేశాలకు వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ అవసరం. ప్యారిస్ ఒలింపిక్‌లో భారత హాకీ బృందం ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. భగవంత్ మాన్ భారత హాకీ జట్టును అభినందించారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో 1972 తర్వాత మొదటిసారి ఆ జట్టును ఓడించింది.