Chandrababu: సీఎం చంద్రబాబుకు అర్జీలు ఇచ్చేందుకు మంగళగిరికి పోటెత్తిన ప్రజలు... ఫొటోలు ఇవిగో!
- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన చంద్రబాబు
- మూడు గంటల పాటు నిలబడే ఉన్న సీఎం
- సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ
- రాజధాని, అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చిన ప్రజలు
నేడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. సీఎం స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున్న ప్రజలు తరలివచ్చి సీఎంకు అర్జీలను అందించారు.
మూడు గంటలకు పైగా నిలబడే ఉన్న చంద్రబాబు వేల మంది నుంచి వినతిపత్రాలు అందుకుని, వారి సాధకబాధకాలు విన్నారు. అర్జీదారులు సీఎం ముందు నేరుగా తమ గోడును చెప్పుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారులకు చంద్రబాబు భరోసా కల్పిస్తూ వినతులన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రెవెన్యూ సమస్యపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని... రెవెన్యూ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మండలం ప్రతి ఊరిలో భూ కుంభకోణం బయట పడుతోందన్నారు. రీసర్వే అస్తవ్యస్తంగా చేసి రికార్డులను తారుమారు చేసి ప్రజలు సమస్యల్లోకి నెట్టారన్నారు.
ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడం వలనే నేడు భూ సమస్యలతో బాధితులు పెద్ద ఎత్తున అర్జీలు తీసుకుని కేంద్ర కార్యాలయని వస్తున్నారని తెలిపారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అన్నారు.
అన్ని వ్యవస్థలను 100 రోజుల్లో గాడిలో పెడతామన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
వినతులు ఇచ్చేందుకు రాష్ట్ర నలుమూలల నుండి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాలు, నియోజకవర్గాల్లోనే వినతులు తీసుకునేలా చర్యలు చేపడతామని అర్జీదారులకు సీఎం భరోసా ఇచ్చారు.
వీటితో పాటు పలువురు ఉద్యోగాల కోసం అర్జీలు ఇవ్వగా, వైసీపీ హయాంలో తమ పింఛన్ లు తొలగించారంటూ వృద్ధులు వినతిపత్రాలు తీసుకు వచ్చారు. పెద్ద ఎత్తున దివ్యాంగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తూ వినతులు ఇచ్చారు. అన్నింటినీ పరిశీలిస్తామని చంద్రబాబు, పల్లా శ్రీనివాసరావు తెలిపారు
రాజధాని, అన్న క్యాంటీన్లకు విరాళాలు
ఇవాళ విన్నపాలతో పాటు విరాళాలు కూడా వచ్చాయి. అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు.
కంకిపాడుకు చెందిన రైతు ఎన్.ప్రభాకర్ రావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన జి.వీ.మాణిక్యమ్మ అనే వృద్ధురాలు తన చేతికున్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందించారు. భగవద్గీత గ్రూపు తరఫున నిర్మల అనే వృద్ధురాలు రూ.3.42 లక్షలను విరాళంగా అందించారు.
చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే దివ్యాంగుడు రూ.25 వేలు, చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్ నాయుడు లక్ష రూపాయలను రాజధానికి విరాళంగా అందించారు.
విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి అనే వృద్ధులు అన్న క్యాంటీన్ కు రూ.2 లక్షలు విరాళంగా అందించారు. వీరందరికీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.