Kesineni Chinni: అమరావతికి రైల్వే లైన్ రావడం సంతోషదాయకం: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని
- కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తుందని వెల్లడి
- చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో వెళుతుందన్న చిన్ని
- 40 రోజుల్లోనే కేంద్రం అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చిందని వివరణ
ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్ రావడం హర్షణీయం అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు అందించిందని తెలిపారు.
ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపిందని కేశినేని చిన్ని వెల్లడించారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడ ప్రజల కష్టాలు తీరబోతున్నాయని, మహానాడు రోడ్ నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్, ఈస్ట్ బైపాస్ రోడ్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు.
మూడేళ్లలో ఈస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. త్వరలోనే తూర్పు బైపాస్ రివైజ్డ్ డీపీఆర్ సమర్పిస్తామని వెల్లడించారు. మహానాడు-నిడమనూరు మధ్య 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పారు.
అమృత్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి నిధులు ఇస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఏపీ సమస్యలను పార్లమెంటులో వినిపించామని , ఏపీలో రవాణా సౌకర్యాలు మెరుగుడతాయని వివరించారు.