Harbhajan Singh: ఇర్ఫాన్ పఠాన్‌ను తక్కువ చేసే ప్రయత్నం... పాక్ ఫ్యాన్‌కు హర్భజన్ గట్టి కౌంటర్
- ఇర్ఫాన్ పఠాన్‌ను తమ కెప్టెన్ బాబర్ అజామ్ పట్టించుకోలేదన్న పాక్ ఫ్యాన్
- ఇందుకు సంబంధించి ఓ వీడియో పోస్ట్
- అందులో పఠాన్ ఎక్కడ అంటూ హర్భజన్ సింగ్ ప్రశ్న
- అయినా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడిగితే మీ కెప్టెన్‌కు కష్టం కదా అని చురక
- ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇలాగే చేస్తారు వదిలెయ్ భజ్జీ అని పఠాన్ ట్వీట్
తమ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌ను హైలెట్ చేస్తూ, భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను తక్కువ చేసేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పాక్ అభిమానికి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వరల్డ్ కప్‌లో ఓ మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ సహచరులతో కలిసి గ్రౌండ్‌ను వీడుతున్నాడు.
ఈ సమయంలో ఇంటర్వ్యూ ఇవ్వాలంటూ బాబర్‌తో ఇర్ఫాన్ పఠాన్ మొత్తుకున్నాడని, కానీ తమ కెప్టెన్ అతనిని పట్టించుకోలేదని పాక్ ఫ్యాన్ ఓ వీడియోను షేర్ చేశాడు. అయితే అందులో ఇర్ఫాన్ పఠాన్ ఎక్కడా కనిపించలేదు. దీనిపై భజ్జీ కౌంటర్ ఇచ్చాడు.
'అసలు ఈ వీడియోలో ఇర్ఫాన్ పఠాన్ ఎక్కడ ఉన్నాడు? అసలు నీకు మర్యాద తెలియదు... నీ కళ్లు ఇప్పుడు నిజాన్ని చూడటం మానేశాయా? అయినప్పటికీ ఇది ఒరిజనల్ వీడియో కాదు. ఒకవేళ నిజమైనదే అనుకుంటే... ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడిగితే మీ కెప్టెన్‌కు కష్టం కదా!' అని చురక అంటించాడు.
ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ అంశంపై స్పందించాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ఉపయోగిస్తుంటారని విమర్శించారు. అబద్దాలను ప్రచారం చేసి సోషల్ మీడియాలో స్టార్లుగా మారదామనుకుంటారు ఇలాంటివారు... వారి లక్ష్యం అదే... వదిలెయ్ భజ్జీ అని ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు.