Israel: ఇజ్రాయెల్‌పై ఇరాన్, హిజ్బుల్లా దాడులు ఈ రోజు నుంచే మొదలు!
- నేడే దాడులు షూరు చేసే అవకాశం ఉందన్న అమెరికా
- జీ7 దేశాల విదేశాంగమంత్రులను అప్రమత్తం చేసిన విదేశాంగ మంత్రి బ్లింకెన్
- దాడుల నివారణకు ఇజ్రాయెల్ ముందస్తు దాడులు చేసే అవకాశం ఉంటుందన్న కథనాలు
తూర్పు ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్, హిజ్బుల్లా ఇవాళ్టి (సోమవారం) నుంచే దాడి మొదలు పెట్టే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఈ మేరకు జీ7 దేశాల విదేశాంగ మంత్రులను ఆయన అప్రమత్తం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
కాగా తమ భూభాగంపై దాడులను తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం సమాయత్తమవుతోందని, ఇరాన్‌పై ముందస్తు దాడికి అనుమతి ఇవ్వొచ్చని ఇజ్రాయెల్ ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ పేర్కొంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొస్సాద్, షిన్ బెట్ల చీఫ్‌లు డేవిడ్ బర్నియా, రోనెన్ బార్లతో నెతన్యాహు సమావేశమయ్యారని పేర్కొంది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి కూడా పాల్గొన్నారని వివరించింది.
కాగా శనివారం ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హిజ్జుల్లా కేవలం సైనిక లక్ష్యాలకే పరిమితం కాబోదని, ఇజ్రాయెల్‌లోని ఇతర ప్రాంతాలపై కూడా గురిపెడుతుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది.
ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులు ఇవే..
ఇదిలావుంచితే.. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతీకార చర్యగా హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. నాటి నుంచి, దాదాపు 10 నెలలుగా సరిహద్దులో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులకు ఆజ్యం పోస్తూ ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాల్ మైదానంపై హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ప్రతీకారంగా ఈ దాడికి వ్యూహ రచన చేసిన హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ ను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ పరిణామంతో హిజ్బుల్లా మరింత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్‌కు హిజ్బుల్లా మద్దతు ప్రకటించింది. ఈ రెండు కలిసి ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.