Sheikh Hasina: దేశం నుంచి పారిపోయిన షేక్ హసీనా... సైన్యం చేతికి బంగ్లాదేశ్ పాలన
- ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో 100 మందికి పైగా మృతి
- ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
- ఢాకాలోని ప్రధాని ప్యాలెస్ దిశగా దూసుకొచ్చిన వేలాది మంది నిరసనకారులు
- సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిన షేక్ హసీనా
- హింసకు ముగింపు పలకాలని ఆర్మీ చీఫ్ జనరల్ వకీర్ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో విముక్తి పోరాట యోధుల రిజర్వేషన్ కోటాకు సంబంధించి ఆ దేశంలో హింస చోటు చేసుకుంది. గత కొన్ని వారాల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 300 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని షేక్ హసీనా ముందు జాగ్రత్త చర్యగా ఢాకాలోని తన ప్యాలెస్ నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.
ఇదిలా ఉండగా, షేక్ హసీనా హెలికాప్టర్లో ఢాకా నుంచి భారత్కు వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. షేక్ హసీనా, ఆమె సోదరి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి ఢాకా అధికార భవన్ నుంచి బయలుదేరారని మీడియాలో వార్తలు వచ్చాయి.
సైన్యం చేతుల్లోకి పాలన
షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో దేశ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా ఆర్మీ చీఫ్ జనరల్ వకీర్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ఈ సందర్భంగా, హింసకు ముగింపు పలకాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత సైన్యానిదే అన్నారు.