Imran Khan: జైల్లో ఇమ్రాన్ ఖాన్‌కు నాసిరకం భోజనం పెడుతున్నారు: పీటీఐ పార్టీ ఆరోపణలు
- పంజాబ్ సీఎం మరియం ఆదేశాల మేరకు సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపణ
- ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆందోళన
- ఆధికార పీఎంఎల్ఎన్ పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందని విమర్శ
ఇమ్రాన్ ఖాన్‌కు జైల్లో నాసిరకం భోజనం పెడుతున్నారని పీటీఐ పార్టీ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టై ఏడాది పూర్తైన నేపథ్యంలో ఆ పార్టీ ఈరోజు బ్లాక్ డేను పాటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ... పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఆదేశాల మేరకే తమ పార్టీ అధినేతకు సరైన భోజనం పెట్టడం లేదన్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వైద్య పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు.
జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ తమతో చెప్పారని పీటీఐ సీనియర్ నేత మూనిస్ ఎలాహి సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ భోజనం కారణంగా తన ఆరోగ్యం చెడిపోతుందని కూడా ఇమ్రాన్ ఖాన్ చెప్పారని తెలిపారు. అధికార పీఎంఎల్ఎన్ పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందని ఎలాహి మండిపడ్డారు.
ఈ దేశ ప్రజల హక్కుల కోసం ఇమ్రాన్ ఖాన్ ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ ఆయన బలంగా నిలబడ్డారన్నారు. అందుకు అతనికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఇమ్రాన్ ఖాన్‌పై పెట్టిన కేసులు ఫేక్ అని ఆరోపించారు. అందుకే అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఓ వైపు తీవ్రమైన వేడి, మరోవైపు ఫ్రిజ్ లేకపోవడం వల్ల ఆహారం పాచిపోతోందన్నారు. దీంతో ఇమ్రాన్‌కు ఫుడ్ పాయిజన్ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అతని ఆరోగ్యం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను గత ఏడాది అరెస్ట్ చేశారు.