Cognizant: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్... రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం
- అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో కాగ్నిజెంట్ సీఈవో భేటీ
- దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కొత్త సెంటర్
- కాగ్నిజెంట్‌కు అన్ని విధాలా సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి హామీ
తెలంగాణలో భారీ విస్తరణకు ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికాలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ సహా తెలంగాణలో ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగ్నిజెంట్ విస్తరణ, కొత్త సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ సంస్థలు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానాలుగా ఎంచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.
కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాదిమంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని టైర్ 2 కంపెనీలకు ఐటీ సేవలను విస్తరించాలని సీఎం సూచించారు. ఈ సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ ఉందని, ఈ నగరం అందరి దృష్టిని ఆకర్షిస్తోందని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపామన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న తమ కొత్త సెంటర్ ద్వారా తమ క్లయింట్స్‌కు మరిన్ని మెరుగైన సేవలను అందిస్తామన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ ఆధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ ప్రత్యేక దృష్టి సారించనుందని తెలిపారు.