Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై స్పందించిన మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్
- ఆమె దేశం విడిచి వెళ్లిపోవాలనుకోలేదనీ, తామే పట్టుబట్టి పంపించామని వెల్లడి
- భద్రతపై ఆందోళనతో ఒత్తిడి చేసి పంపించామని వ్యాఖ్య
- బంగ్లాదేశ్‌లో పరిస్థితుల పట్ల ఆమె తీవ్రం విచారం వ్యక్తం చేశారని వెల్లడి
రిజర్వేషన్ల అంశంపై కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింస నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాణ భద్రత కోసం దేశం వీడిన ఆమె ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ దేశం విడిచి వెళ్లకూడదని ఆమె భావించారని, అయితే తాము (కుటుంబ సభ్యులు) పట్టుబట్టి, ఒత్తిడి చేసి అక్కడి నుంచి పంపించామని హసీనా కుమారుడు, ఆమె మాజీ ప్రధాన సలహాదారు సాజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు.
‘‘ఆమె బంగ్లాదేశ్‌లోనే ఉండాలనుకున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. కానీ సురక్షితం కాదని మేము చెప్పాం. ఆమె భద్రత పట్ల మేము ఆందోళన చెందాం. అందుకే దేశం విడిచి వెళ్లేందుకు ఒత్తిడి చేసి ఒప్పించాం’’ అని సాజీబ్ చెప్పారు. అమెరికాలో నివసించే సాజీబ్ వాజెద్ జాయ్ వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
‘‘నేను ఆమెతో మాట్లాడాను. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చూసి ఆమె చాలా నిరాశ చెందారు. బంగ్లాదేశ్‌ను అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలనేది ఆమె కల. అందుకే ఈ పరిస్థితులు చూసి చాలా నిరాశ చెందారు. గత 15 సంవత్సరాలుగా ఆమె చాలా కష్టపడ్డారు. తీవ్రవాదం నుంచి, ఉగ్రవాదం నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచారు’’ అని అన్నారు.
‘‘బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. కానీ ఈ సమయంలో మా పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎలా సాధ్యమవుతాయనేది చూడాలి. మేము బంగ్లాదేశ్‌ను ఎంతగా అభివృద్ధి చేయగలమో చూపించాం. బంగ్లాదేశ్ ప్రజలు మా వైపు నిలబడటానికి సిద్ధంగా లేకపోతే.. హింసాత్మక పరిస్థితులు సృష్టిస్తున్నవారే నాయకత్వాన్ని పొందుతారు’’ అని అన్నారు.
తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చు: సాజీబ్
షేక్ హసీనా తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చునని సాజీబ్ వాజెద్ జాయ్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని మార్చడానికి ఆమె ప్రయత్నించారని, అయితే ప్రభుత్వంపై ప్రజల బలమైన సెంటిమెంట్ కారణంగా ఆమె నిరాశ చెందారని పేర్కొన్నారు. అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నారని వివరించారు.
‘‘ఆమె బంగ్లాదేశ్‌ను అభివృద్ధి చేశారు. షేక్ హసీనా అధికారం చేపట్టినప్పుడు బంగ్లాదేశ్‌ను ఒక విఫల దేశంగా చూసేవారు. పేద దేశంగా భావించేవారు. అయితే నేడు ఆసియాలో ఎదుగుతున్న పులులలో ఒకటిగా బంగ్లాదేశ్‌ను పరిగణిస్తున్నారు’’ అని జాయ్ అన్నారు. బీబీసీ ‘వరల్డ్ సర్వీస్ న్యూస్ హవర్’ కార్యక్రమంలో సాజీబ్ వాజెద్ జాయ్ ఈ మేరకు మాట్లాడారు.