Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఈవెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లిన నీరజ్ చోప్రా

Neeraj Chopra storms into javelin final of Paris Olympics 2024
  • క్వాలిఫ‌య‌ర్ రౌండ్‌లో జావెలిన్ ను 89.34 మీటర్ల దూరం విసిరిన గోల్డెన్ బాయ్‌
  • ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించిన వారిలో మ‌నోడే టాప్‌ 
  • మ‌రో భార‌త అథ్లెట్ కిషోర్ జెనా ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలం
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఈవెంట్లో ఇండియన్ గోల్డెన్ బాయ్ నీర‌జ్ చోప్రా ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వాలిఫ‌య‌ర్ రౌండ్‌లో అతడు జావెలిన్ ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ కోసం గ్రూప్-బీ నుంచి పోటీ పడ్డాడు. త‌న తొలి ప్ర‌య‌త్నంలోనే జావెలిన్‌ను ఏకంగా 89.34మీ విస‌ర‌డం గ‌మ‌నార్హం. 

ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించిన వారిలో మ‌నోడే టాప్‌. ఆ త‌ర్వాతి స్థానంలో గ్రెనడాకు చెందిన‌ ఆండర్సన్ పీటర్స్ (88.63మీ.), జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.76 మీటర్లతో మూడో స్థానంలో నిలవగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నాలుగో స్థానంలో నిలిచాడు. 

ఇది నీరజ్ చోప్రా కెరీర్‌లో రెండో అత్యుత్తమ త్రో. 2022లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతని అత్యుత్తమ వ్యక్తిగత త్రో వ‌చ్చేసి 89.94 మీటర్లు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్న విష‌యం తెలిసిందే.

నీర‌జ్‌తో పాటు పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా ఫైన‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి ప్ర‌య‌త్నంలోనే జావెలిన్ ను 86.59 మీటర్లు విసిరి అర్హ‌త సాధించాడు. 

అయితే, ఈ ఈవెంట్‌లో మ‌రో భార‌త క్రీడాకారుడు కిశోర్ జెనా నిరాశ ప‌రిచాడు. అతడు క్వాలిఫికేషన్ రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి ప్రయత్నంలో 80.73మీటర్లు, రెండో ప్రయత్నంలో ఫౌల్, మూడో అటెంప్ట్ లో 80.21మీటర్లు విసిరిన కిశోర్ 12వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు ఒక్క స్వర్ణం కానీ, రజతం కానీ చేజిక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో, నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాలని, పారిస్ వేదికగా త్రివర్ణ పతకాన్ని ఎగురవేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
Neeraj Chopra
Paris Olympics 2024
Javelin Final
Sports News

More Telugu News