Bnagladesh: అప్పుడు శ్రీలంకలో కనిపించిన సీన్లే... ఇప్పుడు బంగ్లాదేశ్ లోనూ కనిపించాయి!
- బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటం
- హింసాకాండకు దారితీసిన వైనం
- ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా
- ప్రధాని నివాసాన్ని లూటీ చేసిన ఆందోళనకారులు
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురై కుప్పకూలుతున్న ఘటనలు గత కొంతకాలంగా ప్రపంచంలో ఏదో ఒక మూల దర్శనమిస్తున్నాయి. ఆసియా దేశం బంగ్లాదేశ్ లోనూ అదే జరిగింది. రిజర్వేషన్ల విధానాన్ని మార్చాలంటూ రోడ్లెక్కిన నిరసనకారులు, చివరికి ప్రధాని అధికారిక నివాసాన్ని కూడా ముట్టడించడం బంగ్లాదేశ్ లో క్షీణించిన పరిస్థితులకు ప్రబల నిదర్శనంగా నిలిచింది.
ఆందోళనకారుల ముట్టడికి కొద్ది సమయం ముందే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి సైనిక విమానంలో భారత్ కు పయనమయ్యారు. ఆమె వెళ్లిపోయిన కాసేపటికే నిరసనకారులు ఢాకాలోని ప్రధాని నివాసంలోకి చొరబడ్డారు. ప్రధాని పరుండే బెడ్ పై పడుకుని సేద దీరారు. కొందరు ఫ్రిజ్ లోని ఆహారాన్ని బయటికి తీశారు. కొందరు ప్రధాని నివాసంలోని వార్డ్ రోబ్ లోంచి మహిళల లో దుస్తులను బయటికి తీసి ప్రదర్శించడం ఫొటోల్లో కనిపించింది.
కొన్ని వీడియోల్లో అరాచకం కనిపించింది. ప్రధాని నివాసం నుంచి టీవీలు, కుర్చీలు, టేబుళ్లు, ఇతర ఫర్నిచర్ ను లూటీ చేయడం ఆ వీడియోల్లో చూడొచ్చు. కొందరు ప్రధాని కోసం ఉద్దేశించిన చేపలు, మేకలను, బాతులను ఎత్తుకెళ్లారు. ప్రధాని నివాసంలోని వస్తువులను, విలువైన కళాఖండాలను... దేన్నీ వదలకుండా తీసుకెళ్లారు.
ఇలాంటి ఘటనలు బంగ్లాదేశ్ లోనే కాదు... గతంలోనూ జరిగాయి. శ్రీలంకలో దేశాధ్యక్ష భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించినప్పుడు కూడా ఇవే సీన్లు కనిపించాయి.
అధ్యక్ష భవనంలోకి చొచ్చుకుని వచ్చిన నిరసనకారులు... అది తమ సొంత ఇల్లే అన్నట్టుగా ప్రవర్తించడం ప్రపంచమంతా టీవీల్లో చూసింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఉల్లాసంగా గడిపారు. కింగ్ సైజ్ బెడ్ పై పడుకుని ఫొటోలకు పోజులిచ్చారు. లాన్ లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ, టైమ్ పాస్ చేశారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో జరిగిన తిరుగుబాట్ల సమయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.