Hockey semi final: ఆశల గల్లంతు.. పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్లో ఓడిన భారత హాకీ జట్టు
- జర్మనీ చేతిలో 3-2 తేడాతో పరాజయం
- ఆట 54వ నిమిషంలో నిర్ణయాత్మక గోల్ సాధించిన ప్రత్యర్థి
- చివరి 5 నిమిషాల్లో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన భారత్.. అయినా తప్పని నిరాశ
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు ఆశలన్నీ అడియాసలయ్యాయి. జర్మనీతో జరిగిన సెమీ ఫైనల్ పోరులో 3-2 తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో పతకం గెలవడం ఖాయమని ఆశించిన భారత అభిమానుల హృదయాలు బద్దలయ్యాయి. ఆట 54వ నిమిషంలో తన సహచరుడు గొంజాలో సహకారంతో జర్మనీ ఆటగాడు మార్కో మిల్ట్‌కౌ సాధించిన నిర్ణయాత్మక గోల్.. మ్యాచ్ ఫలితాన్ని వారివైపు తిప్పింది. పూర్తి సమయం 60 నిమిషాల ఆటను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ మైదానంలో జర్మనీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
మ్యాచ్‌లో గోల్ కోసం చివరి 5 నిమిషాల్లో భారత ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ జర్మనీ వశమైంది. ఈ ఓటమితో భారత ఆటగాళ్ల హృదయాలు బద్దలయ్యాయి. హార్దిక్ సింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేష్ భారమైన హృదయాలతో కనిపించారు. స్వర్ణ పతకం గెలవాలని కలలు కన్నప్పటికీ అడుగు దూరంలో నిలవడంతో ఆటగాళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే కాంస్యం పతకం కోసం పోటీ పడే అవకాశం ఉంది.