Muhammad Yunus: బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారధిగా నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్
- ఆందోళన చేపడుతున్న విద్యార్థి సంఘాల సమన్వయకర్తలు, అధ్యక్షుడు షహాబుద్దీన్ మధ్య భేటీలో నిర్ణయం
- పేదరిక నిర్మూలన సిద్ధాంతానికి యూనస్‌కు దక్కిన నోబెల్ శాంతి పురస్కారం
- 2007లో నాగోరిక్ శక్తి పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు
- మద్దతు దక్కపోవడంలో ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ముహమ్మద్ యూనస్
రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌ను కుదిపేయడంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశాన్ని గాడిన పెట్టేందుకు తాత్కాలికంగా ఏర్పడనున్న ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ సారధిగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రెస్ సెక్రటరీ జాయ్నల్ అబెడిన్ ధ్రువీకరించారు. అధ్యక్షుడు షహబుద్దీన్, నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల సమన్వయకర్తల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ముహమ్మద్ యూనస్ ఎవరు?
నోబెల్ అవార్డ్ గ్రహీత అయిన ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రస్తుత వయసు 84 సంవత్సరాలు. పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన అధ్యయనానికి నోబెల్ అవార్డ్ దక్కింది. పేదలు, ముఖ్యంగా మహిళలకు పూచీకత్తు లేకుండా సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా పేదరికంపై గెలవవచ్చని ఆయన చెప్పారు. గ్రామీణ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. దీంతో 2006లో ఆయనను నోబెల్ శాంతి బహుమతి వరించింది. అయితే ఆర్థిక అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 150కి పైగా కేసులు ఆయనపై ఉన్నాయి. ఈ కేసుల్లో దోషిగా తేలితే కొన్నేళ్లపాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరోపణలు అన్నింటినీ ఆయన ఖండిస్తున్నారు.
సొంతంగా పార్టీ ఏర్పాటు..
ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ రాజకీయాలకు వీలైనంత ఎక్కువ దూరం ఉంటూ వచ్చారు. అయితే దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపుపొందారు. పాశ్చాత్య దేశాలలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీంతో 2007లో సొంతంగా నాగోరిక్ శక్తి పార్టీని (పౌరుల శక్తి) స్థాపించి బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రధాన పార్టీలైన అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఆయనకు పెద్దగా మద్దతు లభించకపోవడంతో పోటీ చేయాలనే తన ప్రయత్నాలను విరమించుకున్నారు. అయితే షేక్ హసీనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.
యూనస్ 1940లో చిట్టగాంగ్‌లో పుట్టారు. ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. స్కాలర్‌షిప్‌పై వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. 1969లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్థికశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరియర్ మొదలుపెట్టారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా పేద ప్రజలకు రుణాలు అందించే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయడం ఆయనకు ప్రధాన విజయంగా ఉంది. ఇక ఒక టెలికం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి 2 మిలియన్ డాలర్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.