Chandrababu: అక్టోబరు 1 నాటికి బెస్ట్ లిక్కర్ పాలసీ తీసుకువస్తాం: సీఎం చంద్రబాబు
- క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో రాజకీయ అంశాలు మాట్లాడిన చంద్రబాబు
- గత ప్రభుత్వంలో నాసిరకం బ్రాండ్లు తెచ్చారని ఆరోపణ
- వైసీపీ నేతల జేబులు నింపేందుకే డిజిటల్ పేమెంట్లు తీసుకురాలేదని వెల్లడి
ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిశాక సీఎం చంద్రబాబు మంత్రులతో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మద్యం విధానం గురించి ప్రస్తావించారు. మద్యం తయారీకి 16 శాతం ఖర్చవుతుందని, 84 శాతం ఆదాయం జేబుల్లోకి వచ్చేలా వైసీపీ నేతలు మద్యం అమ్మారని ఆరోపించారు.
మద్యం ఆదాయం ప్రభుత్వానికి రాకుండా వైసీపీ నేతలు దోచేశారని వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి నాసిరకం బ్రాండ్లు తెచ్చారని విమర్శించారు. వైసీపీ నేతల జేబులు నింపేందుకే డిజిటల్ పేమెంట్ విధానం తీసుకురాలేదని చంద్రబాబు ఆరోపించారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అన్ని మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచిందని వివరించారు. అక్టోబరు 1 నాటికి ఉత్తమ మద్యం విధానం తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఈలోగా తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మద్యం విధానాలను అధ్యయనం చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మద్యం విధానాల అధ్యయనం కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.