Suryakantham: ఆ ఒక్క మాట నన్ను కుంగదీసింది: సూర్యకాంతం తనయుడు మూర్తి!
- గయ్యాళి అత్త పాత్రల్లో మెప్పించిన సూర్యకాంతం
- ఆమెకి ప్రేమించడమే తెలుసన్న తనయుడు
- ఆర్టిస్టులంతా ఆమెతో చనువుగా ఉండేవారని వెల్లడి
- అమ్మంటే జయలలితకి ఎంతో ఇష్టమని వివరణ
సూర్యకాంతం .. గయ్యాళి అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రెస్. అప్పట్లో ఆమె పేరు పెట్టుకోవడానికి కూడా చాలామంది భయపడేవారు. అంతలా తన నటనతో ప్రభావితం చేసిన గొప్ప ఆర్టిస్ట్ ఆమె. అలాంటి సూర్యకాంతం గురించి ఆమె తనయుడు అనంత పద్మనాభమూర్తి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
తెరపై ఆమె ఎంత గయ్యాళిగా కనిపిస్తుందో .. బయట ఆమె అంత మంచిది. అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉండేది. ఇంటికి ఎవరు వచ్చినా రకరకాల పదార్థాలు వండి పెట్టేది. జయలలిత మొదలు ఆనాటి హీరోయిన్స్ అంతా అమ్మ వంటలను ఎంతో ఇష్టపడేవారు. భానుమతి .. షావుకారు జానకి .. అంజలీదేవి .. శారద .. ఇలా అందరూ మా ఇంటికి తరచూ వచ్చేవారు. జయలలిత అమ్మగారు సంధ్యతో అమ్మకి ఎంతో సాన్నిహిత్యం ఉండేది" అని అన్నారు.
"సంధ్యగారు చనిపోయినప్పుడు జయలలితగారికి అండగా నిలబడింది అమ్మనే. అందువలనే ఆ కృతజ్ఞత జయలలితగారు చివరివరకూ చూపించారు. అమ్మ కిడ్నీ సమస్యతో చనిపోయింది. అప్పుడు జయలలితగారు వచ్చారు. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి. 'అమ్మకి ఇలా ఉందనే విషయం నాకు చెప్పొచ్చు గదా, ఇంకా ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పించేదానిని" అని అన్నారు. ఆ ఆలోచన తట్టలేదే అనే ఒక బాధ నన్ను చాలా కుంగదీసింది" అని చెప్పారు.