Vinesh Phogat: వినేశ్ చేతిలో ఓడిపోయిన అమ్మాయికి బంపర్ చాన్స్
- బాధాకర రీతిలో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిన వినేశ్
- 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటు
- సెమీఫైనల్లో వినేశ్ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నేలిస్ కు ఫైనల్లో చోటు
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనూహ్య రీతిలో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడం తెలిసిందే. 50 కిలోల కేటగిరిలో ఫైనల్ చేరిన వినేశ్ ఫోగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో అనర్హత వేటుకు గురైంది.
ఈ నేపథ్యంలో, సెమీఫైనల్లో వినేశ్ ఫోగాట్ చేతిలో ఓడిపోయిన క్యూబా అమ్మాయి యుస్నేలిస్ గుజ్మన్ లోపెజ్ కు అద్భుతమైన అవకాశం లభించింది. వినేశ్ ఫోగాట్ స్థానంలో ఫైనల్లో పోటీ పడే అవకాశం యుస్నేలిస్ కు లభించింది.
50 కిలోల రెజ్లింగ్ ఫైనల్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్థానాన్ని యుస్నేలిస్ తో భర్తీ చేస్తున్నామని పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రకటించారు. అంతర్జాతీయ రెజ్లింగ్ నియమావళిలోని ఆర్టికల్ 11 ప్రకారం వినేశ్ ఫోగాట్ అనర్హురాలైందని వివరించారు. ఇప్పుడామె స్థానంలో ఫైనల్లో యుస్నేలిస్ పోటీ పడుతుందని వెల్లడించారు.