Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వెనుక కుట్ర దాగి ఉందా? అన్న ప్రశ్నకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ స్పందన ఇదే!
- అనర్హత వేటు అనేది సాంకేతిక అంశమనీ, రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి
- ఇందులో ఎలాంటి కుట్ర లేదన్న అథ్లెటిక్స్ ఫెడర్షన్ ఆఫ్ ఇండియా
- 53 కేజీల విభాగానికి బదులు ఈసారి 50 కిలోలకు మారడంతో బరువు తగ్గాల్సి వచ్చిందని వెల్లడి
రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు అంశం చర్చనీయాంశంగా మారింది. 50 కిలోల విభాగంలో ఈరోజు ఫైనల్ రేసులో పాల్గొనాల్సిన ఫొగాట్... 50 కిలోల కంటే 100 గ్రాముల అదనపు బరువు ఉండటంతో అనర్హత వేటు ఎదుర్కొంది. అనర్హత వేటు వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని అథ్లెటిక్స్ ఫెడరేషన్ తోసిపుచ్చింది.
వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు అనేది సాంకేతిక అంశమని, దీనిని రాజకీయం చేయవద్దని కోరింది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని పేర్కొంది. సాధారణంగా ఫొగాట్ 53 కేజీల విభాగంలో పోటీ పడేవారని... కానీ తాజాగా 50 కిలోల విభాగంలోకి మారడంతో బరువు తగ్గించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక బరువు సమస్య ఉంటుందని తెలిపింది. అధిక బరువు విషయంలో సడలింపులు ఉండవని పేర్కొంది.
ఈ మేరకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆదిల్ సుమరీవాలా వివరణ ఇచ్చారు. బరువు కొలిచిన తర్వాతే తినడానికి, పానీయాలు తీసుకోవడానికి అనుమతి ఇస్తారన్నారు. వెనువెంటనే మూడు పోటీలలో పాల్గొనవలసి ఉంటుందన్నారు. ఆ పోటీల మధ్య వ్యవధిలోనే శక్తిని పొంది... మళ్లీ పోరాడేందుకు తినవలసి ఉంటుందన్నారు.
బరువు తగ్గించేందుకు వినేశ్ ఫొగాట్ సహ శిక్షకులు, వైద్యులు రాత్రంతా మేల్కొని ఉన్నట్లు వెల్లడించారు. ఉదయం బరువు తూయగా అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఆ బరువును తగ్గించేందుకు కూడా జుట్టు కత్తిరించారని, అయినప్పటికీ 100 గ్రాములు అదనంగా బరువు తూగినట్లు చెప్పారు. అందుకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు.