Chandrababu: జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు... అర్ధాంగి భువనేశ్వరి కోసం రెండు చీరల కొనుగోలు
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
- విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో కార్యక్రమం
- చేనేత కార్మికుల స్టాళ్లను సందర్శించిన చంద్రబాబు
విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయగా, చంద్రబాబు ఆయా స్టాళ్లను పరిశీలించి, చేనేత ఉత్పత్తులను పరిశీలించారు.
చేనేత కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేశారు. ఈ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు.
చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో రూ.110 కోట్ల మేర చేనేత రుణాలు మాఫీ చేశామని వివరించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు మళ్లీ 33 శాతం రిజర్వేషన్లు తీసుకువస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో చట్టం తెచ్చి, పార్లమెంటులో ఆమోదం పొందేలా కృషి చేస్తామని చెప్పారు.
పి-4 విధానం వల్ల సంపద సృష్టి, అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. చేనేత పరిశ్రమపై త్వరలోనే సమగ్ర విధానం తీసుకువస్తామని పేర్కొన్నారు. చేనేతపై జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని, లేకపోతే రీయింబర్స్ మెంట్ ద్వారా అయినా చేనేత కార్మికులకు చేయూతనిస్తామని తెలిపారు.
.