Nara Bhuvaneswari: చేనేత చీరలు కొని తెచ్చినందుకు థాంక్యూ: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నారా భువనేశ్వరి
- నిన్న జాతీయ చేనేత దినోత్సవం
- నారా భువనేశ్వరి కోసం రెండు చీరలు కొనుగోలు చేసిన చంద్రబాబు
- హర్షం వ్యక్తం చేసిన భువనేశ్వరి
నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేశారు. దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన కోసం చేనేత చీరలు కొని తెచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు.
"విజయవాడలో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం అద్భుతమై నిర్ణయం. చేనేత అనేది గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మాత్రమే కాదు, స్థిరమైన, నైతిక వారసత్వ కళా సంపద. మనం చేనేత దుస్తులను ధరించాలని నిర్ణయించుకున్నామంటే, మన సంప్రదాయ దుస్తుల శైలికి సంబంధించిన అందమైన వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టే లెక్క.
మీ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అంకితభావంతో చేస్తున్న కృషి ఎంతో సంతృప్తికరంగా ఉంది" అంటూ చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.