Jangaon CI: న్యాయవాదుల ఆందోళనతో స్పందించిన ఉన్నతాధికారులు .. పోలీసులపై చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
- న్యాయవాదులపై అనుచితంగా ప్రవర్తించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
- జనగామ సీఐ, ఎస్ఐపై బదిలీ వేటు వేసిన వరంగల్ సీపీ
- ఏఆర్‌కు కానిస్టేబుల్ అటాచ్
న్యాయవాద దంపతులపై అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో ఓ సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌పై వేటు వేసింది తెలంగాణ సర్కార్. జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. జనగామ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి, ఎస్ఐ తిరుపతిపై బదిలీ వేటు వేసిన వరంగల్ సీపీ .. కానిస్టేబుల్ బి.కరుణాకర్‌ను ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
బాధితురాలి వివరాలు తెలుసుకునే నిమిత్తం న్యాయవాద దంపతులు ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో వారి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాద సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు.