Gaza: నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికిపైగా దుర్మరణం

Over 100 people were killed as Israeli strikes a school housing displaced people in eastern Gaza

  • గాయాలపాలైన అనేక మంది నిరాశ్రయులు
  • గతవారం మూడు స్కూళ్లపై దాడి జరిపిన ఇజ్రాయెల్ సేనలు
  • హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా పనిచేస్తున్నాయనే అనుమానంతో దాడులు


గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ సేనలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ఈ మేరకు పాలస్తీనా అధికార వార్తా సంస్థ ‘వాఫా’ పేర్కొంది.  

స్కూళ్లపై వరుస దాడులు..
గత వారం కూడా మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఆగస్టు 4న గాజా నగరంలో నిరాశ్రయ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి జరపగా ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై దాడి జరిగింది. ఆ దాడిలో 15 మంది చనిపోయారు.

ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతోనే..!
కాగా గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి వందలాది మందిని చంపేశారు. నాటి నుంచి హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా అనుమానిస్తున్న అన్ని భవనాలపై దాడులు చేస్తోంది. ఉగ్రవాదులు ఉంటున్నారని అనుమానిస్తున్న స్కూల్స్‌పై దాడులకు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కాగా గత 10 నెలల సుదీర్ఘ యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయి ఉంటారని అంచనాగా ఉంది.

  • Loading...

More Telugu News