Duvvada: దువ్వాడ కుటుంబ వివాదంలో ట్విస్ట్.. వాణి నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ఎమ్మెల్సీ ప్రకటన
- భార్యాపిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ
- తనకు ప్రాణహాని ఉందని ఆవేదన
- ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి వచ్చారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని వెల్లడించారు. భార్యాపిల్లల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు దౌర్జన్యం చేయడంతో పాటు వాణి, తన కూతురు హైందవి సహా ఐదుగురు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారని, అనుచరులతో కలిసి వాణి తనను చంపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. వాణితో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య వాణి, కూతురు కలిసి తనను అంతమొందించాలని చూస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ అండతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా తనను వేధిస్తున్నారని వాపోయారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. ఎస్పీ తిరస్కరించారని చెప్పారు. తాజాగా వాణి, ఆమె అనుచరులు తన ఇంటిపై దాడి చేయడంతో గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.