Rahul Gandhi: మంచి నిర్ణయం: ప్రధాని మోదీకి 'థ్యాంక్స్' చెప్పిన రాహుల్ గాంధీ
- నేడు వయనాడ్‌లో ప్రధాని మోదీ పర్యటన
- ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్
- వయనాడ్ విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ఆశాభావం
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వయనాడ్ పరిస్థితిని సమీక్షిస్తున్నందుకు ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ పర్యటించడం మంచి నిర్ణయమన్నారు. ఇక్కడి పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా చూడటం ద్వారా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
'భయంకర విషాదాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వయనాడ్‌ను సందర్శిస్తున్నందుకు మోదీకి ధన్యవాదాలు. ఇది మంచి నిర్ణయం. ప్రధాని ఈ భయంకర విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశాక దానిని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని విశ్వసిస్తున్నాను' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం కేరళలోని కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌ను సందర్శించి, బాధితులను పరామర్శించనున్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే కన్నూర్ విమానాశ్రయంలో దిగారు. హెలికాప్టర్‌లో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆయన వెంట ఉండే అవకాశముంది. వయనాడ్ విపత్తుతో వందలాదిమంది మృతి చెందిన విషయం విఇతమే!