Exercise: వ్యాయామం చేయడానికి ముందు ఏమేం తినొచ్చు?
- వ్యాయామం చేసే ముందు ఆహారం తినొచ్చా, లేదా అనే దానిపై ఎన్నో సందేహాలు
- స్వల్పంగా ఆహారం తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు
- శరీరానికి అన్నిరకాల పోషకాలు అందేలా ఉండాలని సూచన
చాలా మంది ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే ఎక్సర్ సైజ్ చేసే ముందు ఏదైనా ఆహారం తీసుకోవచ్చా అన్న దానిపై మాత్రం ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏదైనా తిన్నాక వ్యాయామం చేయడం ఇబ్బందికరమన్న భావన కూడా ఉంది. అయితే స్వల్పంగా ఆహారం తీసుకుని వ్యాయామం చేయడం వల్ల లాభం ఉంటుందని డైటీషియన్లు, వ్యాయామ నిపుణులు చెప్తున్నారు. శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే ఆహారం అయితే మంచిదని సూచిస్తున్నారు. మరి అలాంటి ఆహారంపై చేసిన సూచనలేవంటే..
- పీనట్ బట్టర్ తో ఒకట్రెండు యాపిల్స్ తింటే శరీరానికి శక్తితోపాటు పోషకాలు లభిస్తాయి.
- ఒకట్రెండు అరటి పండ్లు తీసుకోవచ్చు. ఇవి త్వరగా జీర్ణమై శక్తిని ఇస్తాయి. వ్యాయామం వల్ల అలసిన కండరాలు రిపేర్ అవడానికి వీటిలోని పొటాషియం తోడ్పడుతుంది.
- ఒక చిన్న బౌల్ లో ఓట్ మీల్ తీసుకోవచ్చు. ఇది మెల్లగా శరీరానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది.
- హోల్ గ్రెయిన్ (పొట్టుతీయని ధాన్యాల) పిండితో చేసిన బ్రెడ్, అవకాడో పండ్లు, పచ్చి టమాటాలతో కూడిన శాండ్ విచ్ తీసుకోవచ్చు.
- గుప్పెడన్ని బాదం పప్పులు తీసుకోవడం వల్ల వ్యాయామం తర్వాత శరీరానికి తీవ్ర అలసట అనిపించకుండా ఉంటుంది.
- పండ్ల ముక్కలు, పెరుగు, ప్రొటీన్ పౌడర్ వంటివి కలిపిన స్మూతీలు తీసుకుంటే మంచి శక్తి వస్తుంది.
- వివిధ రకాల డ్రైఫ్రూట్స్, నట్స్ కలిపిన మిక్స్ తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
నోట్: ఇవన్నీ నిపుణులు సాధారణ వ్యక్తుల కోసం చేసిన సూచనలు. ఆయా వ్యక్తులు, వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచనల మేరకు ఆహారాన్ని తీసుకోవడం మంచిది.