Wayanad: వయనాడ్ ప్రజల కలలన్నీ కల్లలైపోయాయి: ప్రధాని మోదీ
- వయనాడ్ విలయంలో చిక్కుకున్న వారికి అండగా నిలవాలని పిలుపు
- ఈ విపత్తుతో వందలాది కుటుంబాలు సర్వస్వాన్ని కోల్పోయాయని ఆవేదన
- రిలీఫ్ క్యాంపులో బాధితులను కలిసి అండగా ఉంటానని హామీ ఇచ్చానన్న ప్రధాని
ప్రకృతి విపత్తు కారణంగా వయనాడ్ ప్రజల కలలన్నీ కల్లలైపోయాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వయనాడ్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత బాధితులను కలిసి మాట్లాడారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ... వయనాడ్ విలయంలో చిక్కుకున్న వారికి మనమంతా అండగా నిలవాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఈ విపత్తుతో వందలాది కుటుంబాలు సర్వస్వాన్ని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిలీఫ్ క్యాంపులో బాధితులను కలిసినట్లు చెప్పారు.
అందరం కలిసి పని చేసి బాధితులకు అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పని చేయాలని సూచించారు. ఆప్తులను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలన్నారు. ఈ దుఃఖ సమయంలో అండగా ఉంటానని బాధితులకు చెప్పానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తు నష్టపరిహారంపై అంచనాలు పంపిన వెంటనే సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇది సాధారణ విపత్తు కాదన్నారు.