Sunkishala: సుంకిశాల సైడ్ వాల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తుకు సీపీఎం డిమాండ్
- రిటైనింగ్ వాల్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఎం బృందం
- పనులు గడువులోగా పూర్తి చేయకపోవడం వల్లే కూలిందన్న సీపీఎం
- ప్రభుత్వం నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచన
సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాఫ్తు జరపాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. రిటైనింగ్ వాల్ కూలిన ప్రాంతాన్ని సీపీఎం ప్రతినిధి బృందం శనివారం పరిశీలించింది. అనంతరం జూలకంటి మాట్లాడుతూ... నిర్మాణ కంపెనీ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయలేదని, దీంతో ఇది కూలిపోయిందని ఆరోపించారు. దీనికి మెగా ఇంజినీరింగ్ కన్ స్ట్రక్షన్ కంపెనీదే బాధ్యత అన్నారు.
దీని నిర్మాణ పనులను ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించడం లేదని ఆరోపించారు. రిటైనింగ్ వాల్ కూలిపోయిన సమయంలో అక్కడ పని చేసేవారు లేరని, అందుకే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. వరదలు పైనుంచి వస్తున్నప్పుడు సిమెంట్ పనులు చేయడంతో పాటు సరిగా క్యూరింగ్ కూడా కాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనులను పర్యవేక్షించాలని సూచించారు.