Chandrababu: త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్ని నియమిస్తా: చంద్రబాబు
- హైదరాబాదులో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
- తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారన్న చంద్రబాబు
- మరో మూడు వారాల్లో సభ్యత్వ నమోదు ఉంటుందని వెల్లడి
- కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తెలంగాణలో పోటీ చేయలేకపోయామని వివరణ
హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో నేడు సమావేశం అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల పెంపుపై చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించారు.
గడచిన నాలుగు దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు, విజయాలను ప్రస్తావించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లోని క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకెళ్లాలని సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నూతన కమిటీల ఏర్పాటుపై చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 15-20 రోజుల్లో సభ్యత్వాల నమోదు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సూచనప్రాయంగా తెలిపారు. సభ్యత్వాల నమోదు పూర్తయ్యాకే కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తానని తెలిపారు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ ఎన్నిక టీడీపీ పోటీ చేయలేకపోయిందని చంద్రబాబు వివరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని తెలిపారు. కొన్ని కారణాల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.