Revanth Reddy: అమెరికాలో ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్ డాక్టర్ రామ్ చరణ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy met business consultant Dr Ram Charan in US
  • అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు
  • కాలిఫోర్నియా బే ఏరియాలో నిర్వహించిన బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. అనేకమంది పారిశ్రామికవేత్తలను, సీఈవోలను కలుస్తూ, తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. 

తాజాగా, అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి  ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్ ను కలిశారు. 

గత 40 ఏళ్లుగా అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, పలు అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు, బోర్డులతో కలిసి పనిచేసిన డాక్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యాచరణపై ఆసక్తి కనబర్చారు.

డాక్టర్ రామ్ చరణ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా,టయోటా, నోవార్టిస్,జనరల్ ఎలక్ట్రిక్, యూఎస్ టీ గ్లోబల్, కేఎల్ఎం ఎయిర్‌లైన్స్, మ్యాట్రిక్స్‌ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు కన్సల్టెంట్ గా పనిచేశారు. పలు కంపెనీలకు కన్సల్టెంట్ గా ఉంటూనే డాక్టర్ రామ్ చరణ్  30కిపైగా పుస్తకాలు రాశారు. 

డాక్టర్ రామ్ చరణ్ అనుభవం తెలంగాణ పురోగతికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శించి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించి, అవి విజయవంతం అయ్యేందుకు అవసరమైన సూచనలు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ రామ్ చరణ్ ను ఆహ్వానించారు
Revanth Reddy
Dr Ram Charan
Business Consultant
USA
Telangana

More Telugu News