K Natwar Singh: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
- హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్ నేత
- చాలా కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడ్డారన్న కుటుంబ సభ్యులు
- ఇవాళ ఢిల్లీలో జరగనున్న అంత్యక్రియలు
చాలాకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత కే నట్వర్ సింగ్ శనివారం రాత్రి కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన గత రెండు వారాలుగా చికిత్స పొందారని తెలిపారు.
నట్వర్ సింగ్ అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం నట్వర్ సింగ్ కొడుకు హాస్పిటల్ వద్ద ఉన్నారని, మిగతా కుటుంబ సభ్యులు కూడా స్వస్థలం నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిపారు. కొంతకాలంగా నట్వర్ సింగ్ ఆరోగ్యం బాగాలేదని, శనివారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని వివరించారు. అంత్యక్రియలు ఇవాళే జరగనున్నాయి.
కాగా నట్వర్ సింగ్ 1929లో రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జన్మించారు. మాజీ కాంగ్రెస్ ఎంపీ అయిన కే నట్వర్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-05 కాలంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతక్రితం పాకిస్థాన్ రాయబారిగా, 1966-1971 వరకు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంలో కూడా పనిచేశారు. ఇక 1984లో ఆయనను పద్మభూషణ్ వరించింది. కే నట్వర్ సింగ్ అనేక పుస్తకాలను కూడా రచించారు.