Nettem Nagendramma: అంతర్జాతీయ అవార్డు గ్రహీత నాగేంద్రమ్మకు సత్కారం
- గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు 2024 అందుకున్న నాగేంద్రమ్మ
- గ్లోబల్స్థాయి అవార్డు ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమన్న బుడితి రాజశేఖర్
- ప్రకృతిసాగు నైపుణ్యాన్ని ఇతర రైతులతో పంచుకోవాలన్న వ్యవసాయశాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు
ప్రఖ్యాత గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు 2024 ఏపీకి రావడం గర్వకారణమని వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బాతులపల్లి మండలం, ఘంటాపురం గ్రామానికి చెందిన నెట్టెం నాగేంద్రమ్మ పోర్చుగల్ దేశపు ప్రకృతి వ్యవసాయం అత్యుత్తమ అవార్డు గుల్ బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డును గత జూలైలో అందుకున్నారు. ఈ సందర్భంగా నిన్న స్థానిక పంచాయతీరాజ్ కమిషనర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగేంద్రమ్మను ఘనంగా సత్కరించారు.
తను పొందిన ప్రకృతిసాగు నైపుణ్యాన్ని ఇతర రైతులతో పంచుకుని ప్రకృతి వ్యవసాయ విస్తరణకు నాగేంద్రమ్మ కృషి చేయాలని వ్యవసాయశాఖ సంచాలకులు ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రభుత్వ సలహాదారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ సన్మాన గ్రహీతను అభినందించారు. రైతులకు మెరుగైన జీవనోపాది కల్పించడంతో పాటు వాతావరణంలో మార్పులు తీసుకు రావడం, సమాజానికి ఆరోగ్యకర పౌష్టికాహారాన్ని అందించడం, భూమి ఆరోగ్యం మెరుగుపరచడంలో ఆమె చేసిన కృషికి ఈ అవార్డు రావడం వచ్చినట్టు తెలిపారు.