Kolkata: హంతకుడిని పట్టిచ్చిన హెడ్ సెట్
- కోల్ కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు
- సివిక్ వాలంటీర్ ను అరెస్టు చేసిన పోలీసులు
- వివరాలు వెల్లడించిన కోల్ కతా ఎస్పీ
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ (పీజీ మెడికల్ స్టూడెంట్) ఇటీవల ఆసుపత్రిలోనే దారుణ హత్యకు గురయ్యారు. చంపడానికి ముందు హంతకుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. దీంతో మెడికోలు, ట్రైనీ డాక్టర్లు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మెడికోల ఆందోళనలతో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు. అదే ఆసుపత్రిలో వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి సంజయ్ ను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోల్ కతా ఎస్పీ వినీత్ గోయల్ మీడియాకు వివరించారు.
హత్యా స్థలంలో హెడ్ ఫోన్..
ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం చేస్తుండగా నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్ సెట్ పడిపోయింది. ఇది గుర్తించని సంజయ్ హత్య చేశాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహం బయటపడ్డాక అందరిలాగా తాను కూడా అయ్యో పాపం అంటూ సానుభూతి ఒలకబోశాడు. అయితే, హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్ సెట్ దొరికింది. అది బాధితురాలిది కాదని తేలడంతో నిందితుడిదే అయుంటుందని పరిశోధన చేపట్టారు.
దీంతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు. హత్యా స్థలంలో దొరికిన హెడ్ సెట్ కూడా అతడిదేనని తేలడంతో సంజయే ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానించారు. ఇతరత్రా లభించిన ఆధారాలతో సంజయ్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించనట్లు సమాచారం. దీంతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి, కేసును పకడ్భందీగా పుటప్ చేస్తున్నారు. నిందితుడికి న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వినీత్ పేర్కొన్నారు.