Kollu Ravindra: అక్కడ జగన్ పేరును తొలగించిందే వైసీపీలోని ఆయన అభిమానులు: కొల్లు రవీంద్ర
- అంబేద్కర్ విగ్రహం వద్ద కేవలం ఆయన పేరే ఉండాలన్న రవీంద్ర
- జగన్ తన పేరును పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నారని విమర్శ
- అంబేద్కర్ వద్ద జగన్ పేరును వైసీపీ నేతలే జీర్ణించుకోలేకపోయారన్న మంత్రి
అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ సీఎం జగన్ పేరును వైసీపీలోని ఆయన అభిమానులే తొలగించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్మృతి వనంలో మాజీ సీఎం పేరు తొలగింపుపై వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద కేవలం ఆయన పేరే ఉండాలన్నారు. కానీ జగన్ తన పేరును పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నారని విమర్శించారు. దీనిని జీర్ణించుకోలేక ఆ పార్టీలోని వైసీపీ అభిమానులే తమ పార్టీ అధినేత పేరును తొలగించినట్లు చెప్పారు.
మచిలీపట్నం గిలకలదిండిలోని షిప్పింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ, మత్య శాఖ అధికారుల బృందం పరిశీలించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కొల్లు రవీంద్ర... అధికారులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏపీలో దాదాపు 970 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. వేటలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు.
మత్స్యకారులు, ఆక్వారంగ అభివృద్ధి కోసం మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరామన్నారు. ఎన్నో చేప జాతులు అంతరించిపోతున్నాయని, కొత్త జాతులను ఆవిష్కరించాలన్నారు. మడ అడవుల ప్రాధాన్యత తెలియక వాటిని నరికివేస్తున్నారన్నారు.
సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. త్వరలో కేంద్ర రైల్వే శాఖామంత్రిని కలిసి మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం కలిపేలా సహకరించాలని కోరుతామన్నారు. గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ అంచనాలు పెంచి లబ్ది పొందారని ఆరోపించారు. కానీ నిర్మాణాలు మాత్రం ముందుకు సాగలేదన్నారు.