Supriya Sule: ఫోన్ హ్యాకర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు: సుప్రియా సూలే
- హ్యాకర్లు 400 డాలర్లు డిమాండ్ చేస్తున్నారన్న సుప్రియా సూలే
- పార్టీ ప్రధాన కార్యదర్శి వాట్సాప్ కూడా హ్యాక్ అయిందన్న సుప్రియా
- డబ్బులు బదిలీ చేయడానికి హ్యాకర్లు ఖాతా వివరాలు ఇచ్చారని వెల్లడి
హ్యాకర్లు తన నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. నిన్న ఆమె ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయింది. దీంతో ఆమె వెంటనే ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు ఎవరూ ఫోన్ చేయవద్దని, వాట్సాప్ సందేశాలు కూడా పంపించవద్దని సూచించారు. తాజాగా, హ్యాకర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
హ్యాకర్లు తన నుంచి 400 డాలర్లు డిమాండ్ చేస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సుప్రియా సూలే తెలిపారు. మన కరెన్సీలో ఇది రూ.33 వేలకు పైగా ఉంటుంది.
తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అదితి నలవాడే వాట్సాప్ కూడా హ్యాక్ అయిందని, తన నుంచి హ్యాకర్లు రూ.10,000 డిమాండ్ చేస్తున్నారని కూడా సుప్రియా సూలే తెలిపారు. డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతూ వారిని కాల్లోనే ఉంచే ప్రయత్నం చేశామన్నారు. డబ్బులు బదిలీ చేయడానికి వారు బ్యాంకు ఖాతా వివరాలను కూడా ఇచ్చినట్లు తెలిపారు.