Youtuber: 'నెమలి మాంసం కూర' వీడియో పోస్టు చేసిన తెలంగాణ యూట్యూబర్ అరెస్ట్
- నెమలి కూర ఎలా వండాలో చెబుతూ వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్
- నెమలి కూర వండటం చట్ట విరుద్ధం కావడంతో అరెస్ట్ చేసిన అటవీ శాఖ సిబ్బంది
- వండిన నెమలి కూరను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపించిన ఫారెస్ట్ అధికారులు
నెమలి కూర ఎలా వండాలో చెబుతూ వీడియో చేసిన ఓ తెలంగాణ యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యూట్యూబర్ ప్రణయ్ కుమార్ 'శ్రీ టీవీ' పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. వివిధ రకాల వీడియోలు చేస్తుంటాడు. తాజాగా నెమలి మాంసం కూర పేరిట ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇది చట్ట విరుద్ధం కావడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
నెమలి జాతీయ పక్షి. దానిని పట్టుకోవడమే నేరం. అలాంటిది ఏకంగా నెమలి కూర వండినట్టు సదరు యూట్యూబర్ పోస్టు పెట్టడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. యూట్యూబర్ ప్రణయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వండిన నెమలి కూరను స్వాధీనం చేసుకున్నారు.
అయితే తాను వండింది చికెన్ కూర అని, కేవలం వ్యూస్ కోసమే అలాంటి టైటిల్ పెట్టానని ప్రణయ్ చెబుతున్నాడని అధికారులు అంటున్నారు. దీంతో అతను వండిన కూరను ల్యాబ్ టెస్ట్ కోసం పంపించారు.
కాగా, ప్రణయ్ నెమలి కూర రెసిపి పేరిట వీడియో చేయడం పట్ల జంతు ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షణ సంఘాలు భగ్గుమన్నాయి. ఆ యూట్యూబర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.