Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి బెయిల్ పిటిషన్ విచారణలో ట్విస్ట్ .. విచారణ మళ్లీ వాయిదా

Twist in Pinnelli bail petition hearing adjourned again

  • మొదట విచారించిన న్యాయమూర్తే విచారించాలన్న పోలీసుల తరపు న్యాయవాది
  • రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరపాలని కోరిన పిన్నెల్లి తరపు న్యాయవాది
  • పిటిషన్లను ఏ బెంచ్ విచారించాలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన న్యాయమూర్తి
  • విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది, ఈ పరిణామంతో విచారణ మరికొంత కాలం వాయిదా పడింది. సోమవారం హైకోర్టులో పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంలో, పోలీసుల తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.

అశ్వనీకుమార్ తన వాదనలో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను జస్టిస్ మల్లికార్జునరావు కొట్టివేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, బెయిల్ పిటిషన్లను ముందుగా విచారించిన న్యాయమూర్తే తర్వాత దాఖలయ్యే పిటిషన్లను కూడా విచారించాలనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.

పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి, సుప్రీం కోర్టు ఉత్తర్వులు ప్రస్తుత కేసులో వర్తించవని, రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్, పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాలు ఏ బెంచ్‌లో విచారణ జరగాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలింగ్ రోజున పాల్వాయిగేటు కేంద్రంలోకి అనుచరులతో కలిసి చొరబడి, ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, మరుసటి రోజు కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిపి, సీఐ నారాయణస్వామిని గాయపర్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై రెంటచింతల, కారంపూడి పోలీసులు పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి, హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News