India: 2036 నాటికి 152 కోట్లు దాటనున్న మన దేశ జనాభా
- వెల్లడించిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక
- 2011తో పోలిస్తే 2036 నాటికి పెరగనున్న మహిళల శాతం
- 2036 నాటికి తగ్గనున్న 15 ఏళ్ల లోపు వారి జనాభా
- క్రమంగా తగ్గుతున్న సంతానోత్పత్తి
2036 నాటికి భారతదేశ జనాభా 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది. 2011తో పోలిస్తే 2036లో 15 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న వారి నిష్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి క్షీణతే ఇందుకు కారణంగా పేర్కొంది.
60 ఏళ్లు, అంతకు పైబడినవారి జనాభా నిష్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. 2011తో పోలిస్తే 2036 జనాభాలో మహిళల నిష్పత్తి కాస్త పెరుగుతుందని వెల్లడించింది. 2011లో 943గా ఉన్న మహిళల నిష్పత్తి 2036లో 952కు చేరుకోనుందని వెల్లడించింది.
2016 నుంచి 2020 వరకు 20-24 ఏళ్ల వారిలో సంతానోత్పత్తి శాతం 135.4 శాతం నుంచి 113.6 శాతానికి, 25-29 ఏళ్లున్న వారిలో 166 శాతం నుంచి 139.6 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 35-36 ఏళ్ల వయస్సు వారిలో 32.7 శాతం నుంచి 35.6 శాతానికి తగ్గింది. జీవితంలో స్థిరపడిన తర్వాతే సంతానం గురించి ఆలోచిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా ఈ నివేదిక తెలిపింది.
2020లో కౌమార సంతానోత్పత్తి రేటు నిరక్షరాస్యుల్లో 33.9 శాతం కాగా, అక్షరాస్యుల్లో 11 శాతంగా ఉంది. శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. ఎప్పుడూ మగ పిల్లల కంటే ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ 2020కి వచ్చేసరికి ప్రతి 1000 మందిలో 28 మరణాలతో ఆడ, మగ సమానంగా నమోదయ్యాయి. 5 ఏళ్ల లోపు పిల్లల మరణాలు 2015లో 43గా ఉండగా, 2020 నాటికి 32కి తగ్గింది. డీపీఐఐటీ 2016 నుంచి 2023 వరకు 1,17,254 స్టార్టప్‌లను గుర్తించింది. ఇందులో 55,816 స్టార్టప్‌లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం గుర్తింపు పొందిన వాటిలో 47.6 శాతం మహిళలు ఉన్నారు.