Thummala: హరీశ్ రావు వ్యాఖ్యలు బాధించాయి: కన్నీటి పర్యంతమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- తాను ఎప్పుడూ క్రెడిట్ కోసం పాకులాడలేదన్న తుమ్మల నాగేశ్వరరావు
- ప్రచారం కోసమే బటన్ నొక్కే పనులు చేయలేదని వ్యాఖ్య
- అవమానించిన వారికి కూడా నేనేంటో తెలుసునన్న తుమ్మల
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యలు తనను బాధించాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. తాను ప్రచారం కోసమే బటన్ నొక్కే పనులు ఎప్పుడూ చేయలేదన్నారు. ఎప్పుడూ క్రెడిట్ కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. ఎకరం పొలం కూడా తనకు సీతారామ ప్రాజెక్టు కింద లేదన్నారు. హరీశ్ రావు అంటే తనకు ఇష్టమని, ఆయన మాట్లాడే సబ్జెక్ట్, ఆయనకు ఉన్న అవగాహన తనకు ఎంతో నచ్చుతాయని వ్యాఖ్యానించారు. కానీ అలాంటి హరీశ్ రావు తనపట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
సీతారామ ప్రాజెక్టు ఘనత కేసీఆర్‌ది అయితే కొంతమంది మంత్రులు తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడుతున్నారని నిన్న హరీశ్ రావు విమర్శించారు. ఫ్లెక్సీల నాయకుడని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తాము తప్పు చేసి ఉంటే ప్రజలే బుద్ధి చెబుతారని హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. తనను అవమానించిన వారికి తానేంటో తెలుసునని ఒకింత కన్నీటిపర్యంతమయ్యారు.
ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పం అన్నారు. తాను కట్టిన వంతెనలు, రోడ్లు తనకు పేరు తెచ్చాయని వ్యాఖ్యానించారు. అంతేకానీ తాను ఫ్లెక్సీల నాయకుడిని కాదన్నారు. తాను చేసిన పనులే తన ఫ్లెక్సీ అన్నారు. తాను ఏ ప్రభుత్వంలో పని చేసినా ప్రజల కోసమే పని చేశానన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోతే వ్యవసాయం చేసుకున్నానని తెలిపారు. కానీ ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదన్నారు.
ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొన్నానన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే మీడియా సమావేశం పెట్టినట్లు చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన ఆవేదనను చెప్పదలచుకున్నానన్నారు.
భద్రాద్రి శ్రీ రామచంద్రుని దయవల్ల... ఎన్టీఆర్ ఆశీర్వాదంతో వేలాది టీఏంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతుంటే.. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేది తన సంకల్పమన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఇబ్బందుల వల్ల దుమ్ముగూడెం కాకుండా దేవాదుల ప్రాజెక్టు చేపట్టామన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ఆధారంగా దుమ్ముగూడెం ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ చేపట్టాలని కోరానన్నారు. కానీ వైఎస్ అకాల మరణం తర్వాత ఇవి పూర్తి కాలేదన్నారు. తాను నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమ ఫలితంగా టీఅర్ఎస్ (బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిందని, ఆ రోజు ప్రాజెక్టు కోసమే కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్లో చేరానన్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం పంప్ హౌస్‌లు మాత్రమే నిర్మాణం చేశారని, రోళ్ళపాడు బయ్యారం అలైన్మెంట్ మార్చారని పేర్కొన్నారు. బీజీ కొత్తూరు, పూసు గూడెం, కమలాపురం పంప్ హౌస్‌లు పూర్తి చేయడానికి వాగులు వంకలు వద్ద బ్రిడ్జి నిర్మాణాలు చేయలేదన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రతిపాదనలు చేశానన్నారు. అలాగే జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేస్తేనే పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లు వస్తాయన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశంతో వెంసూరుకు తమ్మిలేరుకు, ఎన్టీఆర్ కెనాల్‌తో సాగునీళ్లు అందిస్తున్నట్లు చెప్పారు. అత్యంత కరవు పీడిత ప్రాంతాల్లో 32 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు తానే చేశానన్నారు. పాలేరు కరవుకు శాశ్వత పరిష్కారంగా భక్త రామదాసు లిఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశానని, తాను నిర్మాణం చేసిన సాగు నీటి ప్రాజెక్టులపై రైతాంగం సంతోషంగా ఉన్నారని తెలిపారు.