Jagan: పలావు లేదు, బిర్యానీ లేదు... చంద్రబాబు మోసం ప్రజలకు అర్థమవుతోంది: జగన్
- హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడన్న జగన్
- గతంలో తాము ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయడంలేదని ఆరోపణ
- చంద్రబాబు మోసాన్ని చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం రగులుకుంటోందని వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తున్నాడని జనం మాట్లాడుకుంటున్నారని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పలావు పెట్టి బాగానే చూసుకున్నాడని కూడా అనుకుంటున్నారని వివరించారు. కానీ ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు... ప్రజలకు పస్తులు తప్పడంలేదు... చంద్రబాబు చేస్తున్న మోసం ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోంది అని జగన్ వ్యాఖ్యానించారు.
జగన్ ఇవాళ తాడేపల్లిలో అనకాపల్లి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
"ఇవాళ జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఇంటికి వచ్చి పథకాలు అందించే పరిస్థితి లేదు. మళ్లీ జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాలి. రైతు భరోసా అందడంలేదు, అమ్మ ఒడి లేదు... విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, వాహనమిత్ర, ఫీజు రీయింబర్స్ మెంట్, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా ప్రీమియం... ఇవేవీ అందడంలేదు. చంద్రబాబు చేస్తున్న మోసాలను గమనిస్తున్న ప్రజల్లో ఆగ్రహం రగులుకుంటోంది.
మనం మంచి పనులే చేశాం. ఈసారి ఎన్నికల్లో మనలను గెలిపించేది ఆ మంచి పనులే. కష్టాలు ఎప్పుడూ ఉండవు. గతంలో నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. చీకటి తర్వాత వెలుగు ఎలా ఉంటుందో... కష్టాల తర్వాత విజయం కూడా అలాగే వస్తుంది. ఆ విధంగానే, ఈ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే" అంటూ జగన్ పేర్కొన్నారు.