KTR: మొద్దు నిద్ర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటకు తీసుకువచ్చాం: కేటీఆర్
- హాస్టళ్లలో అంతా బాగానే ఉందన్న ఆలోచన నుంచి బయటకు తీసుకువచ్చామన్న కేటీఆర్
- కేసీఆర్ ప్రారంభించిన 1000కి పైగా గురుకులాలపై శ్రద్ధ పెట్టాలని సూచన
- ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్య
తెలంగాణలో గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురుకులాల సందర్శనకు బయలుదేరాడంటూ వచ్చిన పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ పైవిధంగా స్పందించారు.
గురుకుల హాస్టళ్లలో అంతా బాగానే ఉందన్న గాఢ నిద్ర నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటకు తీసుకు రాగలిగామని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1000కి పైగా గురుకులాల్లో ప్రాణనష్టం జరగకుండా, ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని కేటీఆర్ ఇటీవల తెలిపారు. తమ ఈ ప్రకటనతో ప్రభుత్వం మేలుకొందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నిన్న బీబీపేట పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చాయి. గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనల పట్ల కేటీఆర్ విమర్శలు గుప్పించారు.