Jogi Ramesh: జోగి రమేశ్ పాత్ర నిర్ధారణ అయితే ఆయనపైనా కేసు నమోదు చేస్తాం: ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత
- అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ తనయుడి అరెస్ట్
- దర్యాప్తులో ఐదుగురి పేర్లు ఉన్నాయన్న అదనపు ఎస్పీ సౌమ్యలత
- మున్ముందు మరికొందరి పేర్లు కూడా ఉండొచ్చని వెల్లడి
అంబాపురం అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు నేడు మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత నేడు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయితే, ఆయనపైనా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్ ను, సర్వేయర్ రమేశ్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబరును మార్చారని, పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్ మెంట్ లోనే ఉన్నాయని, ఈ వ్యవహారానికి సంబంధించి సీఐడీ అధికారుల నివేదిక కూడా పరిశీలిస్తామని సౌమ్యలత పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని... సీఐడీ, ఏసీబీ విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు ఇస్తామని వివరించారు.
దర్యాప్తులో ఐదుగురి పేర్లు ఉన్నాయని, విచారణ సాగే కొద్దీ మరికొందరి పేర్లు కూడా చోటుచేసుకుంటాయని సూచనప్రాయంగా తెలిపారు. అవ్వా శేషనారాయణ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు.
అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని గుర్తించాకే కేసు నమోదు చేసినట్టు చెప్పారు. సర్వే నెంబరు 88లో స్థలం కొని, సర్వే నెంబరు 87లో ఉందని మార్పు చేసుకున్నారని వివరించారు. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారమే చేశారని... అందుకోసం గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్ చేశారని తెలిపారు.