E-Cabinet: మంత్రులందరికీ ఐప్యాడ్లు... ఇ-క్యాబినెట్ భేటీలపై సీఎం చంద్రబాబు నిర్ణయం
- హైటెక్ సీఎంగా పేరుగాంచిన చంద్రబాబు
- ఇకపై ఇ-క్యాబినెట్ సమావేశాలు
- కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలపై ఆసక్తి
కాగిత రహిత సమావేశాలకు ఏపీ క్యాబినెట్ సన్నద్ధమవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై సీఎం చంద్రబాబు ఎంత ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో, మంత్రులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
గతంలో చంద్రబాబు కాగిత రహిత ఇ-క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడా విధానాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవలే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై జరిగే క్యాబినెట్ సమావేశాలన్నీ కాగిత రహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు.
చంద్రబాబు తొలుత 2014లో ఇ-క్యాబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కనబెట్టింది.
కాగా, క్యాబినెట్ సమావేశం అంటే చాలు... ఆయా అంశాల ఆధారంగా అధికారులు కనీసం 40 సెట్ల పత్రాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కాగిత రహిత ఇ-క్యాబినెట్ సమావేశాల్లో ఆ పరిస్థితి కనిపించదు. ఎంచక్కా, మంత్రుల ఐప్యాడ్లకే సమావేశం అజెండా వివరాలన్నీ అప్ లోడ్ చేస్తారు.
ఈ విధమైన హైటెక్ క్యాబినెట్ సమావేశాలతో పెద్ద మొత్తంలో ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా, క్యాబినెట్ నోట్స్ బయటికి లీక్ కాకుండా ఇ-క్యాబినెట్ విధానం ఉపకరించనుంది.